వైరుధ్యాలు

రాత్రి పదిన్నర.
రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్ ఆనందరావు నిద్రపోతున్నాడు.
తొమ్మిది లోగా తిని పదికి పడుక్కోవటం ముందునుంచీ అతనికున్న అలవాటు.
ఫోన్ మోగే సరికి ఛటుక్కున తెలివి వచ్చి, నిద్రగొంతుతో "హాలో" అన్నాడు.
అవతలనించి తన కొలీగ్ నాగరాజు -
"ఏమోయ్..ఈ అలవాటెప్పడ్నుంచి?ఇంట్లోనే దుకాణమా?"అన్నాడు.
షాకయి ఏదో మాట్లాడి పెట్టేసాడు.
మళ్లీ నిద్ర పట్టేలోగా మళ్లీ ఫోన్ రింగ్.
ఈసారి విశ్శు..తన కొలీగ్.

తన నిద్రగొంతు విని మాట అదోలా అనిపించి 'పంటి సమస్యలేమున్నాయా' అని అడిగి 'ఫలానా డెంటిస్ట్ దగ్గర చూపించుకో'మని సలహా ఇచ్చాడు.
****
తెల్లారి స్కూటీమీద బజారు కి వెళ్తూండగా పెట్రోల్ కొట్టించాలని గుర్తొచ్చి బంకు వేపు వెళ్తుంటే ఎవరో పాన్ షాపు దగ్గర కుర్రాడు పిలుస్తున్నట్లు అనిపించినా బండి నడుపుతూ మరి ఆగలేదు.అసలే క్యూ పెద్దదిగా ఉంది.
 బంకు లోకి దూరి లైను కట్టాడు.
అంతలోపాన్ షాప్ దగ్గర చూసిన అబ్బాయి
రొప్పుతూ తనదగ్గర కొచ్చి -కాళ్లకి దణ్ణం పెట్టాడు.
ఆశ్చర్యం గా చూస్తుంటే-
"గుర్తు పట్ట లేదా మాష్టారు. ఇంటర్లో మీ దగ్గర చదువుకున్న అవినాష్ ని.'"
అన్నాడు.
తను తెలుగుమీడియంలో చదవడం వల్ల ఇంగ్లీషు లో మాట్లాడలేక తనదగ్గర కోచింగ్ తీసుకుని, పేపర్లు చదివి ఆంగ్ల భాషాజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు.
తర్వాత ఐఐటిలో సీటు వచ్చిందిట.
ప్రస్తుతం ఐఐటి లో పాసవుట్ అయ్యాక మంచి పొజిషన్ లో ఉన్నాడట.
పక్కనే ఉన్న పూల దుకాణం లో బొకే తీసుకుని అందించి,
"మీ ఇంటికి రేపు వచ్చి అమ్మగారి దర్శనం చేసుకుంటాను." అని వినయంగా వెళ్లి పోయాడు.
పెట్రోలు పోయించుకుని

అతడి గురించే ఆలోచిస్తూ బండి స్టార్ చేసి ముందుకు వెళుతుండగా, లిఫ్ట్ కావాలన్న సంజ్ఞ చేస్తూ ఒక జులపాల కుర్రాడు కనిపించాడు.
చేతిలో సిగరెట్,జీన్స్,పెద్ద కూలింగ్ గ్లాస్ తో నేటి ఆధునిక యువతకి ప్రతినిధి లా ఉన్నాడు.
ఆలోచిస్తూ స్లో చేసిన తన దగ్గరకు వచ్చిన కుర్రాడిని గుర్తు పట్టాడు.
తరుణ్.
జులాయిలా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ప్రతిక్లాసులో ఫెయిల్ అయ్యే బేక్ బెంచర్.
తనని గుర్తుపట్టలేదేమో.
"అంకుల్ జంక్షన్ దాకా లిఫ్ట్ ఇస్తారా" అనడగుతున్న అతనిని అసహ్యంగా చూస్తూ వినపడనట్టు ముందుకి సాగాడు ఆనందరావు.
కొద్ది సమయంలో ఎంత వైరుధ్య సంఘటనలు...
రాత్రి  తనతో పనిచేసిన ఇద్దరు సహోద్యోగుల మాటల్లో ఎంత వ్యత్యాసం !
ఒకరు తనని తాగుబోతు గా చిత్రిస్తే మరొకరు సానునయంగా మాట్లాడారు.
పొద్దున్న తన దగ్గరే చదువుకున్న ఇద్దరు శిష్యులలో ఒకరు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే మరొకరు నేలకు కొట్టిన మట్డిముద్దలా తయారయ్యారు.
అంతుపట్టని మానవ‌ మనస్తత్వాలకు కారణాలు వెదుకుతూ ఆనందరావు ముందుకి సాగాడు.
బజారు నుండి తిరిగి వస్తుంటే కృష్ణ మందిరం నుండి ఘంటసాల భగవద్గీత వినిపించింది.
శ్రధ్ధాత్రయ విభాగం లో మనుషుల గుణగణాలను వివరించే ఆశ్లోకాలు వింటుంటే తనను దొలుస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరికిందని అనిపించింది.
సృష్టిలో మనుషులంతా ఒకేలా కనిపించినా వారి వారి స్వభావాలను,తినే ఆహారాన్నిబట్టి గుణగణాలు మారిపోతుంటాయి.
సాత్వికాహారాన్ని తిన్న కొందరు సాత్వికులు,మరికొమదరు రజో,లేదా తామస గుణాన్ని కలిగి ఉండవచ్చు.
ఆయా సమయాల్లో వారి వారిస్వభావానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు.
చేదు నీరు పోసినా మిరప మొక్క కారంగా మిరపకాయలు ఇస్తుంది. అలాగే సపోటా,మామిడి తియ్యని ఫలాలు మాత్రమే ఇస్తాయి.
తను అందరికీ ఒకేలా చదువు చెప్పినా వారి స్వభావానుసారం విద్యార్థులు గ్రహిస్తారు.
సంశయ నివృత్తి తో ఇంట్లోకి ఆనందంగా అడుగు పెట్టాడు ఆనందరావు.
******

Comments