పసి కానుక

#ఆదివారం-చిన్నకథ

పసి కానుక
**********
ఒక్కోసారి కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మనకి చాలా కోపం వస్తుంది.కానీ వాస్తవం తెలిసే సరికి  హృదయం ద్రవీభూతమైపోతుంది .
అవతారం విషయం లో కూడా ఆరోజు అదే జరిగింది.
చేతిలో ఉత్తరాల కట్టతో ఇంటి తలుపు తట్టాడు.

"ఎవరదీ?" లేతగొంతు వినిపించింది.
"పోస్ట్! "అని గట్టిగా బదులిచ్చాడు.
అట్నుంచీ సందడి లేదు.
మళ్లీ తలుపు తట్టాడు.
"కిందనుండి తోసేయండంకుల్." అందా లేతగొంతు.

"వీల్లేదమ్మా. రిజిస్టర్ పోస్ట్. సంతకం చెయ్యాలి."

కాస్సేపు నిశ్శబ్దం.

ఎవరో లేస్తున్న అలికిడి.
అవతారాని కి చికాగ్గా ఉంది.
ఇంకా బట్వాడా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. పైన ఎండ మాడ్చేస్తోంది.
తలుపు తీయని ఇంటి వాళ్లమీద కోపం కడుపులో ఆకల్లా మండిపోతోంది.
రిపేరు చెయ్యడానికి పనికిరాని చెప్పుల్ని ఇందాకే కాలువలో కసికొద్దీ గిరవాటు వేశాడు.

 నేలమీద కాళ్లు ఆన్చలేకపోతున్నాడు.

జీతాలు వచ్చేవరకూ కొత్తజోళ్లు కొనే స్తోమత కూడాలేదు.
ఇంటి బాధ్యతలు, అప్పులూ కళ్లముందు కదిలాయి.
ఎప్పటికీ తెరుచుకోని తలుపుల వంక కోపంగా చూసాడు.

చిరాకేసి ఇహ వెళ్లిపోదామనుకుంటూండగా తలుపు మెల్లగా తెరుచుకుంది.
ఎదురుగా నిలబడ్డ పదేళ్లపాపను చూడగానే అవతారం లో కోపం ఆవిరైపోయింది! 
కారణం... బంగారు బొమ్మ లాంటి ఆ పాపకి ఒక కాలు లేదు. పోలియోతో చచ్చుబడింది.
 నీటితో కళ్ళు మసకబారగా పాపకు కవరందించి, కాగితం పై పాప సంతకం తీసుకుని భారమైన గుండెతో వెనుదిరిగాడు.
"అంకుల్!" లేతగొంతు వినిపించింది.
వెనక్కి చూసాడు.
"మీ జోళ్లు....?"
ఏం చెప్పాలో తెలియక తల అడ్డంగా ఆడించాడు.
ఆ పాప మెల్లగా ఇంట్లోకి నడిచి కాస్సేపటికి చెప్పుల జతతో బయటకు వచ్చింది.
"డాడీ నిన్ననే కొత్త చెప్పులు కొనుక్కున్నారు.
పాతవి...మీకు సరిపోతాయేమో చూడండి. బయట ఎండగా ఉంది కదా!"
అవతారం గుండె గొంతుకలో కొచ్చింది.
****
(ఇది నా స్వంతమే.అముద్రితమే.ఏ మాధ్యమాల పరిశీలనలో లేదని తెలియజేస్తున్నాను.)

Comments