నేను

నేను
****
 భూమికి గళ్లు గీసి పంచుతాను

ఆకాశానికి నిచ్చెనలు వేస్తాను

అడవులను అడ్డు రాకుండా నరుకుతాను

సముద్రాల్ని తోడి నిధినిక్షేపాలు వెలికి దీస్తాను

దివారాత్రుల్ని ఏకంచేస్తాను
కృత్రిమ వర్షాలు కురిపిస్తాను

సృష్టి కి ప్రతి సృష్టి చేస్తాను
వియన్మండలాన్ని శాసిస్తాను.

గాలిలో మేడలు కడతాను
మయసభలు కల్ల కాదని నిరూపిస్తాను.

కానీ-

పకృతి ప్రళయాల నంచనా వెయ్యలేను
వార్ధక్య సమస్యల నధిగమించలేను
మహమ్మారి వ్యాధులను నియంత్రించలేను
పెంజీకటి కావల ఏకాకృతిని వెలిగే జ్యోతిని దర్శించలేను

ప్రేమ కోసం పరితపించే జడుణ్ణి
మానవత్వాన్ని మంటగలిపే
పెనుశాపాన్ని
క్షుద్రలోకపు విశృంఖల భావజాలపు వైనాశికాన్ని

స్వచ్ఛమైన జలపాతాలను కలుషితం చేసే నీచుడిని

అన్నీ తెలిసి ఏమీ తెలియని మహామూర్ఖ మానవుడిని

Comments