వైఫై

వైఫై 
***

"ఏమైంది"
గట్టిగా అరిచాను.
ఇంట్లో వాళ్లంతా ఉలిక్కి పడి సర్దుకున్నారు.
"ఎందుకా గావుకేకలు"
మా ఆవిడ చికాగ్గా అడిగింది.
"కరెంటు ఉంది కదా వైఫై రావట్లేదేం?"
"ఎవడికి తెలుసు?వాళ్లనే అడగండి.నిన్న వానకి ఏమైందో?
ఇంతాచేసి ఆ వైఫైకోసమా ఆరాటమంతా?"
మూతి తిప్పుకుని విసవిస వంటింట్లో కి నడిచిందావిడ.
మొబైల్ డేటా కూడా సరిగ్గా లేదు.బఫర్ అవుతోంది.
ఏమైందో?
యాప్ ఓపెన్ చేసి,హెల్ప్ లోకి వెళ్లినా చాట్ కుదరలేదు.
ఈలోగా టింగు మని మెసేజ్.
ఆత్రంగా ఓపెన్ చేస్తే ఎయిర్ టెల్ వాడి మెసేజ్.
మా ఏరియాలో సాంకేతిక కారణాల వల్ల వైఫైకి అంతరాయం కలిగిందని,వీలైనంత త్వరగా సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ,బహుశా ఏడెనిమిది గంటలు పట్టవచ్చని శుభవార్త.
మైగాడ్! వైఫై లేకపోతే టీవీ కూడా...
మేచ్,ఒటిటీ..సీరీయల్స్..
ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్స్టా...
ప్రపంచంతోనే సంబంధం కట్.
సహారా ఎడారిలో ఉన్నట్టుంది.

నన్ను అందరూ ఎగతాళిగా చూస్తున్నట్టనిపించింది.
మా ఆవిడ అన్యాపదేశంగా -"కొందరికి అక్సిజను కన్నా వైఫై అవసరమే ఎక్కువ"అంటోంది.
కిసుక్కున్న నవ్వులు...
కరెంటున్నా గాలి అడనట్టు ఉక్కిరిబిక్కిరిగా,తిక్కతిక్కగా ఉంది.
సరే ఏదో పనిలో పడదామని బీరువా తెరిచాను.
ఒక్కసారి గా బట్టలముటలా మీద పడింది.
బనీన్లు,పంచెలు,చీరలు,గలీబులు,రుమాళ్లు,ఇన్నర్లు కలగలిసి నానాజాతి సమితిలా ఉన్నాయి.
కింద బాసింపట్టు వేసుకుని‌అన్నీ వేరు చేయడం,మడతలు పెట్టడం మొదలుపెట్టాను.
ఇంట్లో వాళ్లు నా పనులు గమనిస్తున్నారని నాకు తెలుసు.
గుసగుసలు చెవిన పడుతున్నాయి.
అన్నీ వేటికవి సర్ది అరల్లో విడిగా కనపడేట్లు పెట్టాను.
ఇంకా పెండింగ్ పన్లు ఏమున్నాయా అని ఆలోచిస్తూ నా టేబుల్ వైపు చూసాను.
క్లాసులో మాష్టారు లేకపోతే చిందరవందరగా ఉండే గదిలా ఉంది.
సగం తెరిచిన గళ్లనుడికట్టు పుస్తకం. దానిపక్కనే కేప్ తీసి ఉంచిన పెన్ను...
పడనా..మాననా అంటూ టేబుల్ అంచున. వేలాడుతున్న పెన్సిల్,రబ్బర్..
పక్కనే నీళ్ల సీసా..సగం తెరచి బోర్లించిన కొమ్మూరి డిటెక్టివ్ నవల,ఇక మిరపకాయ,సగం పూరీముక్కతో ఎంగిలి ప్లేటు.
అన్నీ వరసాగ్గా సర్దేసి కూర్చున్నాను.
వాటుడూ! ఇంకేం చెయ్యడం?
అంతలో టీ పట్టుకొస్తు మా అమ్మణ్ణి నాచేతికి కప్పు అందిస్తూ-
"మరకమంచిదే లా వైఫై పోవడం కూడా మంచిదే!"
అంటూ నవ్వింది.
నేనుకూడా చేసేదిలేక శృతికలిపాను.

Comments