చేసిన పాపం...
***********
హాస్పిటల్ తెల్ల ముసుగు వేసుకున్న దేవకన్యలా ఉంది.
అక్కడ దేవతల్లాంటి నర్సులూ,గంధర్వుల్లాటి డాక్టర్లూ ఉన్నారు.
అక్కడకొచ్చే రోగులు కూడా ఖరీదైన వారే.
వైద్యం కూడా ఖరీదే!
ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ సర్వత్రా లక్ష్మీదేవి తాండవిస్తుంది.
అక్కడి జనరల్ వార్డు లో కూడా ఏసీ పనిచేస్తుంది.
ఆరోజు-
ఎవరో ఫ్రెండుని చూడ్డానికి వెళ్లాను.
అక్కడ కనిపించిది లలిత.
వార్డంతా కోలాహలంగా ఉంది విజిటర్స్ రాకతో.
బయట డాక్టర్లు హుందాగా సూటు,బూట్లు వేసుకున్న అశ్వినీ దేవతల్లా నడుస్తున్నారు.
యూనిఫాం వేసుకున్న మళయాళీ నర్సులు ళకారధ్వనులతో , చేతుల్లో ట్రేలతో అప్సరసలు మారువేషం వేసుకున్నట్టు గబగబ నడుస్తున్నారు.
వార్డులో పడుక్కున్న మచ్చల దుక్క పిల్లి సందడికి లేచి, నోరంతా నిశ్శబ్దంగా తెరచి ఆవలించి, ఒళ్లు విరుచుకుని విహారానికి బయలుదేరింది.
వార్డంతా ఫినాల్,మందుల వాసనల్తో పరిమళిస్తోంది.
అన్నిటినీ పరికించి చూస్తున్న నా కళ్లు ఒక బెడ్ దగ్గర ఆగాయి.
దాదాపు అరవై ఏళ్ల స్త్రీ నీరసంగా బెడ్ మీద ఉంది.
ఆమె మొహం ఎక్కడో చూసిన జ్ఞాపకం...ఈవిడ...బాలాసోర్ లో....అనసూయ..యస్...
మరి పక్కన కూర్చున్న నల్లపిల్ల ఎవరు?
మరో సారి దీక్షగా స్టూల్ పైన కూర్చుని మొబైల్ చూస్తున్న ఆ పిల్ల వంక పరీక్షగా చూసాను.
నా అనుమానం నిజమే!
ఆ పిల్ల కణత దగ్గర ఉన్న పెద్ద సైజు పుట్డుమచ్చ నాకు బాగా గుర్తే.
అంటే....
కాస్త దగ్గరగా వెళ్లి అమె మొహం చూసాను.
బెడ్ పక్కన స్టీల్ స్టూల్ మీద నల్లగా ఉన్నా కళగా కనిపిస్తుంది.
నేను బాలాసోర్ లో పనిచేసిన రోజుల్లోఅనసూయ భర్త ప్రసాద్ నాకు పరిచయం.
ఇంజనీరింగ్ విభాగం లో మేస్త్రీ గా పనిచేసేవాడు.
ఒరిస్సాలో తెలుగు వారు తక్కువ కావటం మూలాన మేము తరచూ కలిసేవారం.
ఆ తర్వాత కొద్ది రోజులకే నాకు ట్రాన్స్ఫరైంది.
మరో ఏడాదికి అతను జబ్బు చేసి పోయాడని,ఆవిడకి భర్త తరపు కారుణ్య నియామక ఉద్యోగం వచ్చిందని విన్నాను.
మళ్ళీ ఇన్నాళ్లకి...ఇక్కడ. ఇలా కలిసింది.
అప్పట్లో వారికి పిల్లలు లేరు.
మరి
ఈ అమ్మాయి...?
నాలో ఉత్సుకత నన్ను అక్కడికి తీసికెళ్లింది.
నన్ను చూసి ఆమె పలకరింపుగా నవ్వింది.
లేవబోతున్న అమెను వద్దని వారించి పక్కనే ఖాళీగా ఉన్న మరో స్టూలు లాక్కుని మంచానికి దగ్గరగా కూర్చున్నాను.
"ఈ పిల్ల" అని నేనడగబోతూండగా నన్నాపుతూ-" లలితా! కిందకి వెళ్లి అ కాయితాలు జిరాక్స్ చేయించి తీసుకురా"అనగానే
ఆ అమ్మాయి తలూపి బేగ్ తీసుకుని వెళ్లి పోయింది.
వెళ్తున్న ఆమె వంకే చూస్తూ-
"మీరు బాలాసోర్ నుండి వెళ్లిపోయిన వారం రోజులకు ప్రసాద్ డ్యూటీలో భాగంగా రైలు పట్టాల పర్యవేక్షణలో తోటి వారితో కలసి నడుస్తున్నప్పుడు ట్రాక్ పక్కన గుడ్డల్లో చుట్టబడిన శిశువు కనపడింది.
పుట్టి వారమై ఉంటుంది.
అలా ఎవరు వదిలేసారో తెలీదు. అక్రమ సంతానమే అయ్యుంటుంది.
కానీ అంత అమానుషంగా బతికి ఉన్న పిల్లను పారేసే రాక్షసులెవరో తెలీదు.
ఎదురుగా బట్ట ల్లో చుట్టబడి కాళ్లు చేతులు కదిలిస్తూ ఏడుస్తున్న బిడ్డను చూడగానే ప్రసాద్ గబగబ ముందుకు నడిచి శిశువును ఎత్తుకుని చుట్టూ చూసాడు. కనుచూపు మేరలో చెట్లు, డొంకలు తప్ప మానవమాత్రులెవరూ కనపడలేదు. ప్రసాద్ తో పాటు ఉన్న ఇద్దరు సహచరులు చుట్టూరా మరోసారి చూసి ఎవరూ కనపడక-
'ప్రసాద్..ఎవరో వదిలేసి ఉంటారు ఈ అక్రమ సంతానాన్ని.
పిల్లలో అని కలవరిస్తున్నారు కాబట్టి మీరే పెంచుకోండి'
అన్నారట.
పిల్ల నల్లగా ఉన్నా కళగా ఉంది.
అలా తెచ్చుకున్న పిల్లని లీగల్ గా దత్తత తీసుకున్నాము.
ఇద్దరం కలసి అల్లారు ముద్దుగా పెంచుతుండగా విధి కి కన్నుకుట్టి ప్రసాద్ ని మలేరియా జ్వరం తో పొట్టను పెట్టుకుంది.
అప్పట్నుంచీ నేనే తల్లీ తండ్రీ గా ఆ పిల్లను సాకాను.
కారుణ్య నియామకం లో ఉద్యోగం పెన్షను,అయన సెటిల్మెంట్ డబ్బుతో చికాకులేమీ ఎదురవలేదు.
పిల్ల కూడా చదువు కుంటూ బిబియే పూర్తి చేసింది.
ప్రస్తుతం హైదరాబాదు లో ఏదో కంపెనీ లో చేరింది.
ఆమెను అక్కడ ముగ్గురు వర్కింగ్ లేడీస్ లతో పాటు ఒక పోర్షన్ లో అద్దెకు మాట్లాడి,వాళ్లక్కావలసిన సామానులు కొని తిరుగు ప్రయాణమవడానికి సిద్ధపడుతుండగా లో బిపి వల్ల కళ్లు తిరిగి పడిపోయాను. పెద్ద ప్రమాదం జరగలేదు గానీ కాస్త రెస్ట్ తీసుకుని బలమైన తిండి తింటే తగ్గిపోతుంది.
రేపే బహుశా డిశ్ఛార్జ్ చేస్తారని తెలిసింది."
జరిగిన విషయమంతా మెల్లిగా మాటలలో చెప్పిందావిడ.
"అయితే ఆ పిల్లకి మీరు పెంచుకుంటున్న వారని తెలుసా" అనడిగాను.
"తెలుసు.మేము చెప్పకపోయినా బయటి వాళ్ల ద్వారా తెలిసింది.
అయినా మమ్మల్ని ఆ విషయం గురించి ఒక్కసారి కూడా అడగలేదు.
మేమే కన్న తల్లిదండ్రులు గా భావిస్తోంది.
వాళ్ల నాన్న పోయినప్పుడు తను చిన్నది.
ఇప్పుడు నన్ను వదిలి క్షణం ఉండదు.
నాకింకా రెండేళ్ల సర్వీసు ఉంది.
వాలంటరీ రిటయిర్మెంట్ తీసుకుని తన దగ్గరకు వచ్చేయమని గోల చేస్తోంది."
నాకళ్లు కూడా చెమ్మ గిల్లాయి.ఆమె దగ్గర సెలవు తీసుకుని వస్తూండగా నాకళ్ల ముందు ఆనాటి దృశ్యం కదలాడింది.
మోసపోయిన మేనకోడలికి రహస్యంగా ప్రసవమయ్యాక ఆ పురిటి గుడ్డుని ఏం చెయ్యలో తెలియక ఆనాడు రైల్వేట్రాక్ పక్కన పడుకోబెట్టి,తుప్పల్లో దాక్కుని జరిగినదంతా చూసినది నేనే మరి.
ఆ పిల్ల కణతమీద రెండంగుళాల మేర కత్తిగాటులాంటి మచ్చ నా మెదడులో నిక్షిప్తమయింది.
ఆ సంఘటన తర్వాత
నా మేనకోడల్ని ఎవరికో కట్టబెట్టినా ఆ కుర్రాడు వ్యసనాలతో ఎక్కువకాలం బతకలేదు. పిల్లలు కలగకపోవడంతో తల్లిదండ్రుల పంచన చేరి చదువుకుని టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. తల్లితండ్రులు పోయాక మరీ వంటరి తనంతో బతుకు వెళ్లదీస్తోంది.
ఇప్పుడు అమెకీ ఒక తోడవసరమే.
కడుపున పుట్టిన బిడ్డ పోయిందని అప్పట్లో నమ్మించాం.
కానీ ఆ పిల్ల అనసూయ పెంపకం లో చక్కగా తయారైంది.
నేను చేసిన పాపం నాకు ఇన్నాళ్లుగా మనస్తాపం కలిగిస్తునే ఉంది.
తల్లీబిడ్డలను వేరు చేసాను అప్పుడు.
ఇప్పుడు మళ్లీ వారిని కలిపితే...
అది సాధ్యమా?
అనసూయ పట్ల ద్రోహమా?
ఒక పాపం కప్పిపుచ్చుకోడానికి మరో పాపం చెయ్యడం ఎంతవరకు సమర్ధనీయం?
ఆలోచనలు.. బుర్ర వేడెక్కుతోంది.
అన్నిటినీ పరిష్కరించే వాడు భగవంతుడే.
ఆయనకే వదిలిపెడితే సరి.తల్లీ బిడ్డలని వేరుచెసిన నేనే మళ్లీ వారిద్దరి కలయికకు కారణమవడం విధి ఆడే వింత నాటకము కాక మరేమిటి!
మర్నాడు-
అనసూయ ను చూడ్డానికి వెళ్లాను.
బెడ్ చుట్టూ అకుపచ్చ తెరలు.
సిస్టర్ ని అడిగాను గాబరాగా.
"ఆమె రాత్రి గుండెపోటుతో పోయారు"
అంది.
ఉలిక్కిపడ్డాను.
"మరి ఆ పిల్ల"అడిగాను.
వేలితో మూలకు చూపించింది.
ఒక్కర్తీ నిశ్శబ్దంగా ఏడుస్తోంది.
నెమ్మదిగా అటువేపు నడిచాను నాపాపం సరిదిద్దుకోడానికి.
*****
భాగవతుల కృష్ణారావు
Comments
Post a Comment