వీడ్కోలు

వీడ్కోలు
*******
వచ్చిన చుట్టాల్ని బండి ఎక్కించి ,వీడ్కోలు చెప్పడం ఒక ప్రహసనం అప్పట్లో...అంటే డెబ్భై ఎనభై ప్రాంతాల్లో నన్నమాట.
ఉన్న నాలుగు రోజుల్లో మాటలన్నీ అయిపోతాయి.
మర్యాదగా ఉండదని వీడ్కోలు కి వాళ్లతోపాటు స్టేషను కి వెళ్లడం..అక్కడ బండి వచ్చేదాక తోచీ తోచని కబుర్లు...రాజకీయాలు..జీతాలు..కరువుభత్యాలు...
ఇహ బండి రాగానే రిజర్వేషన్ అయిన కూపే దగ్గర కు పిల్లల్నీ సామాన్లనీ కూడ దీసుకుని పరిగెట్టడం..
ఎలాగో సీట్లలో సర్దుకుని కూర్చున్నాక-
"నీళ్లు పట్టుకున్నారా? లగేజీ అంతా ఎక్కిందా?
పిల్లలేరీ?
టిక్కెట్లు భద్రంగా ఉన్నాయి కదా"
లగేజి తాళాలు వేసుకోండి."
లాంటి ఫార్మల్ సంభాషణ అయ్యాకఇహ బండి ఎప్పుడు కదుల్తుందా! ఇంటికి పోదామా! అనిపిస్తుంది.
ఏ కారణం వల్లో సిగ్నల్ పడకో, ఇంజన్ సాంకేతిక లోపము వల్లో కాస్త ఆలస్యమయ్యేసరికి మనకి‌లోలోపల చిరాకు వస్తుంది.
అయినా పరధ్యానంగా మాట్లాడవలసి వస్తుంది.
అడిగిన ప్రశ్నలే చెప్పిన జాగ్రత్తలే మళ్లీ రిపీటవుతుంటాయి.
దారి లో తినడానికి చేసిన పులిహారో,దిబ్బరొట్టో,పొంగరమో త్వరగా తిని  నిద్రపోమని చెప్తాం.
బండి కదిలాక వాళ్లు చేసేది అదే.
ఖాళీగా ఉంటే ఆకలి ఎక్కువ.
అయినా మన సహనాన్ని పరీక్షిస్తూ బండి కదలదు.
అఖరికి గార్డ్ విజిల్,పచ్చ జెండా లేదా లైటు కనపడ్డాక 'హమ్మయ్య' అని నిట్టూరుస్తూ చేతులూపడానికి రెడీ అవుతాం.
ఒకసారి మానాన్నగారు..(ఆయన డయాబెటిక్) మా మావయ్య కుటుంబాన్ని సాగనంపడానికి వెళ్లినప్పుడు ఇలాగే బండి కదలక పోయేసరికి -"దిక్కుమాలిన బండి కదల్దే ఎప్పటికీ " అని విసుగ్గా అనేసారు.
మావయ్యవాళ్లకి ఆయన భోళాశంకరుడనీ,అతిమూత్ర వ్యాధిగ్రస్తుడనీ తెలుసు కాబట్టి ఏమనుకోలేదు.

ఇప్పుడు అవన్నీ ఎందరు పాటిస్తున్నారో తెలియదు.
ఎవరి మటుకు వారు కేబ్ బుక్ చేసుకుని స్టేషను కో ఎయిర్పోర్ట్ కో వెళ్లిపోవడమే!

Comments