శుక్రవారం కార్డు కథ-3
బిల్హణీయం
@@@@@
చారని తేలిక సేయకు
చారే కావలె కబళము చరచర సాగన్
చారే లేకను సురలే
చారుల నంపిరి ధరణిని చారే గ్రోలన్"
ఏమోయ్! విన్నావా" తండ్రి గొంతు గట్టిగా హాల్లోంచి వినపడుతోంది..
తనగది లోంచి బయటకు వస్తూ తండ్రి చారు మీద పద్యం విని నవ్వుకున్నాడు.
కృష్ణశర్మ గారు పండిత కవి.
బిల్హణీయం చదువుతున్నప్పుడు పుట్టేడని కొడుక్కి బిల్హణుడని పేరుపెట్టాడు.
కాలక్రమంలో అది కాస్త బిల్లు గా నామాంతరం చెందింది.
'మేరే సప్నోంకీ రాణీకబ్ ఆయేగీ తు'
సన్నగా కూనిరాగం తీస్తూ మెట్లెక్కి డాబా పైకి చేరుకున్నాడు బిల్లూ.
డాబా పిట్టగోడ అంచు పట్టుకుని ఎదుటి మేడ బాల్కనీ వేపు చూసిన బిల్లూ కళ్లు పెద్దవయ్యాయి.
ఎవరీ అపురూప సుందరి?
బ్రహ్మ చాలా తీరిగ్గా,ప్రత్యేకమైన శ్రద్ధతో తీర్చిదిద్దిన శిల్పం లా వుంది.
శ్రీ నాధుడు,పెద్దన చూస్తే ప్రబంధాలు రాసేస్తారన్నట్టుగా వుంది.
హమ్మయ్య ..నా కల..నిరీక్షణ ఫలించింది
వడ్డాది పాపయ్య చిత్రించిన ప్రబంద నాయిక లా వుంది.
అమ్మా వాళ్లకు చెప్పాలి.
బిల్లు వాళ్లు ఇక్కడికొచ్చి వారం రోజులైంది.
బిల్లూ గచ్చిబౌలిలో యేదో సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి వుద్యోగంలోనే వున్నాడు.
ఒక్కడే కొడుకవడం మూలాన తల్లిదండ్రులు కాస్త గారాబంగానే పెంచారు.
పెళ్లి వయసు దాటిపోకుండా యెవర్నయినా చేసుకోమని గోల పెడుతునారు.
తనే యింకా బాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని తాత్సారం చేస్తున్నాడు.
అదీగాక మనసుకి నచ్చిన పిల్ల దొరకాలి కదా!
ఈ వారం రోజులూ వర్కింగ్ డేస్ కావటం మూలాన డాబా సుందరి అతని కళ్ల పడలేదు.
మళ్లీ విజిలేసుకుంటూ.గబగబ మెట్లు దిగి తన గదిలోకి చేరి మంచం మీద వాలిపోయాడు.
మనసంతా చాలా వుల్లాసంగా వుంది..
అఖరికి తన అన్వేషణ ఫలించింది.
రాత్రి చాలా సేపటి వరకూ అమె గురించే ఆలోచిస్తూ యెప్పటికో నిద్రపోయాడు.
కలలో కూడా పాలరాతి బొమ్మ లాంటి స్వరూపం తో ప్రపంచంలో వున్న చూడదగ్గ ప్రదేశాలలో ఆమె తో విహరించేడు.
పొద్దున్న తొమ్మిది గంటలప్పుడు నిద్రలేచి రాత్రి కల నెమరువేసుకుంటూ హాల్లోకి రాబోతూ,తల్లి మాటలు విని ఆగిపోయాడు.
"నిక్షేపం లాటి పిల్ల..కన్నుముక్కు తీరుగా వున్నాయి మన వాళ్లే కదా మన బిల్లూ కోసం మాట్లాడదామని వెళ్లేను.
కుందనబొమ్మలా వుంటుంది..మీరు చూసేరో లేదో...ఇంతకీ గమ్మత్తేమిటంటే ఆ పిల్ల ...నా మతిమండా..యింకా పిల్లేవిటి..వాళ్ల అబ్బాయేనట. నాటకాల్లో ఆడవేషాలవీ వేస్తుంటాడట..
తల్లి యింకా మాటాడుతూనేవుంది.
బిల్హణుడి కేమీ వినపడ్డం లేదు.
Comments
Post a Comment