మానవత్వం

శుక్రవారం పోస్ట్...6
మానవత్వం

"వీల్లేదు"
దృఢంగా అంది మీనాక్షి.
నిస్సహాయంగా చూసి బయటకు నడిచేడు సుందరం.
ఇప్పటికి వారం రోజుల బట్టీ జరుగుతున్న తంతే.
తన ప్రస్తావన మీనాక్షికి నచ్చదు.
ఆమెకెలా నచ్చజెప్పాలో తెలియడంలేదు.
లంకంత కొంప,బోల్డు ఆస్తిపాస్తులు, బాంకు బాలన్స్ లున్నా తమకంటూ సంతానం లేదు.
చూడని డాక్టర్, దర్శించని యోగులూ,యెక్కని కొండలూ లేవు.
చిన్నప్పట్నుంచీ అరవ సంప్రదాయం లో పెరగడం వల్ల చాదస్తాలు వొక్క పిసరు యెక్కువే.
ఒంటరి తనం భరించలేక 
కొన్నాళ్లు కుక్కని పెంచుకుంటే నోరు తిరగని రోగంతో చచ్చిపోయింది.మొదట్లో సణిగినా తర్వాత కుక్కని స్వంత పిల్లలాగే చూసుకుంది మరి.
అప్పుడు మీనాక్షిని పట్టడం కష్టమయింది.
తనక్కూడా చాల బాధ కలిగింది.
పోనీ దగ్గర వాళ్ల పిల్లల్ని పెంచుకుందామనుకుంటే పోటీ యెక్కువగా వుంది.
ఎవర్ని కాదంటే వారికే కోపం.
చాలా ఆలోచించాక అనాధ శిశువును పెంచుకుందామన్న ఆలోచన కలిగింది.నోరులేని  జీవాలను పెంచుకుని  బాధలు పడే కన్నా మానవత్వంతో అనాధకు బ్రతుకు నివ్వడంలోనే పరమార్ధముందని ఆలస్యంగా నయినా గుర్తించగలిగాడు తను..కానీ మీనాక్షి ని వొప్పించడమెలా?

ఆ విషయమే మీనాక్షికి  చెప్పి ఒప్పిద్దామనుకుంటే ససేమిరా అంటోంది.
సరే రేపు చివరి ప్రయత్నంగా తననోసారి అనాధాశ్రమానికి తీసుకువెళితే వాళ్లని చూసాక తన మనసేమైనా మారవచ్చు నని నిశ్చయించుకుని యింటిదారి పట్టేడు.
బాపూ శిశు సంరక్షణా కేంద్రం ముందు కారు ఆపి దిగారు దంపతులిద్దరూ.
గేటు దాటి లోపలికి నడుస్తూ అక్కడ పచ్చిగడ్డిలో ఆడుకుంటున్న పిల్లలను చూసారు.
కొందరు అన్ని మరిచి ఆడుకుంటున్నా కొందరు మాత్రం నిస్తేజంగా,స్తబ్దుగా వున్నారు.
వాళ్ల కళ్లలో నైరాశ్యం..యెవరికోసమో వెదుకులాట స్పష్టంగా కనిపిస్తోంది.
సుందరం మళ్ళీ కౌన్సలింగు మొదలుపెట్టేడు.
"చూడు మీనాక్షీ! అనాధలగా మారన యీ పిల్లల్ని చూడు..
వాళ్లు కోల్పోయిన  ప్రేమ,అప్యాయతలను వాళ్లకు అందిస్తే వాళ్ల జీవితాలను ఆనందంతో నింపిన వాళ్లమవుతాము.
మనకున్న సంపదని యిలాంటి జీవితాలను బాగుపరచడానికి వినియోగిస్తే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు..అపాత్రదానం చెయ్యలేదని పొంగిపోతాడు.
మన బంధువులు వాళ్ల పిల్లల్ని వాళ్లు పెంచుకోగలరు.
వీరిలో యే వొక్కరి బతుకు చక్కదిద్దినా మన జన్మ ధన్యత చెందినట్లే."
మీనాక్షి మొహం చిట్లిస్తూ-
"మరీ కులం,గోత్రం  తెలియని ..."
సుందరం కాస్త కోపంగా-
మీనాక్షీ ! కుక్కల్నీ,పిల్లుల్నీ కులగోత్రాలు చూసి పెంచుకున్నావా?
సాటి మనుషుల్ని..పసిపిల్లల విషయం లో కులగోత్రాల పట్టింపు.. అదీ యీ రోజుల్లో.."

"సరే..కానీ..పద..ఇంటికి పోదాం..నీకిష్టం లేనప్పుడు యిక్కడ మరెందుకు?"
@@@@@@

ఆ రాత్రి..
పన్నెండు గంటలు కొడుతుండగా సుందరం యింటి కాలింగ్ బెల్ మోగింది.
అంత రాత్రి పూట యెవరొచ్చారా అని భార్యాభర్తలు యిద్దరూ లేచి తలుపు తీసారు.
ఎదురుగా యెవరూ కనపళ్లేదు.
చిన్నపాప యేడుపు వినపడింది.
కిందకు చూస్తే..
ఆశ్చర్యం..
బట్టల్లో చుట్టబడ్డ ముద్దులొలికే పసిపాప.
అప్రయత్నంగా స్త్రీ సహజమైన మమకారంతో ముందుకు వంగి  పసిగుడ్డు నెత్తుకుంది మీనాక్షి.

వెనకనుండి భర్త సణుగుడు వినిపిస్తున్నా విననట్టే ముందుకు నడుస్తోంది .
అంతకుముందు తన డాక్టర్ స్నేహితుడు ప్రకాష్ తన క్లినిక్ లో ప్రసవ సమయంలో మరణించిన అనాధ మహిళ గురించి చెప్పినపుడే తనీ నిర్ణయం తీసుకున్న సంగతి మీనాక్షి కి యెన్నడూ చెప్పడు.
తనలో తనే నవ్వుకుంటూ  భార్యననుసరించేడు సుందరం.

Comments