శుక్రవారం పోస్ట్--8
ఇంద్రనీలం
@@@@@@@@
బతికున్న వాళ్లు రావడానికి భయపడే చోటది.
తాము కూడా యేదో వొకరోజు అక్కడకు రాక తప్పదని తెలిసినా అటువంటి వూహలక్కూడా తావివ్వరెవరూ.
సుబ్బమ్మ గారి శవం చితి మీద కాలుతోంది.
చిరనిద్రలో సమాధులున్నాయి.చెట్లు నిటలాక్షుడి జటాజూటాల్లా గాలికి వూగుతున్నాయి.
సుబ్బమ్మ గారి తరపున వచ్చినవారు కొద్దిమందే వున్నారు.
.వారెవరి హావభావాలతో తనకేం సంబంధం లేనట్టు..అలవాటైన డాక్టర్ సునాయాసంగా ఆపరేషన్ చేస్తున్నట్లు కట్టెతో మంటల నెగదోస్తునాడు వీరాస్వామి.
అతడి కొడుకు రాముడు,హౌస్సర్జన్లా తండ్రి వెనకే తిరుగుతూ కిరసనాయిలు సీసాలోంచి చితి పైన,చెప్పినచోట జల్లుతునాడు.
పంతులు అలవాటైన అపర కర్మకు సంబంధించిన మంత్రాలు అలవోకగా చదివేస్తునాడు.
అక్కడున్న సుబ్బమ్మ గారి బంధువులు,కుటుంబ సభ్యుల్లో దుఃఖం జాగాలో కోపం,వుక్రోషం జమిలిగా కనపడుతోంది.
దానిక్కారణం..
'ఇంద్ర నీలం'
వంశపారంపర్యంగా వాళ్ల కుటుంబంలోఇంద్ర నీలం రాయి వుండేది..
అది ప్రతి తరంలో అత్తగారు కోడలికి తన అవసానదశ లో అందజేసేది.
అయితే సుబ్బమ్మ గారికి కోడలు లేదు.
ఉన్నవొక్క కొడుకూ మిలిటరీ లో చేరి యుద్దంలో పోయాడు.
కుతురు,అల్లుడు వున్నారు.
పోనీ కూతురి కేనా యిచ్చిందా అంటే అదీ లేదు.
ఎక్కడ పెట్టిందో నీలం రాయి.
అప్పటికీ పాడెలో పెట్టేముందు క్షుణ్ణంగా వెతికారు.
ఎక్కడా కనపళ్లేదు.
అల్లుడు ఆవేశంగా,కోపంగా వున్నాడు.
కూతురు కూడా యేడుస్తూ తల్లి వంటిని చివరిదాకా తడుముతునే వుంది.
ఆవిడ ట్రంకుపెట్టె దులిపి మరీ వెతికినా కనపళ్లేదా నీలం.
కపాలమోక్షమయ్యాక కదిలారందరూ.
మర్నాడు-
చితి చల్లారాక, అటువైపు వచ్చిన వీరాస్వామి-"రావుడూ" అని కేక వేశాడు.
"ఏందిరయ్యా " అంటూ దగ్గర కొచ్చిన కొడుక్కి వేలితో చితిలోని తెల్లని బూడిద వంక చూపించాడు.
తెల్లని బూడిద మధ్య గరళకంఠుడిలా నీలపు రాయి..!!!
ఆ రాత్రి నిద్దర్లో, తల్లి పిలుపుకు విసుక్కుంటూ వెళ్లిన సుబ్బమ్మ కూతురు చేతిలో నీళ్ల గ్లాసు తగిలి, ముసలామె చేతిలో కూతురికి యిద్దామని పట్టుకున్న నీలపురాయి ఆమె తెరిచున్న గొంతులో పడిపోవడం యెవరికీ,యెప్పటికీ తెలియదు.
Comments
Post a Comment