చేగోడి..శుక్రవారం పోస్ట్17

శుక్రవారం పోస్ట్--17

చేగోడి
---+---
"చాలారోజులై పంటి కిందకేం లేక  బలే విసుగ్గావుందోయ్"

అన్నా.
"నా సొమ్మేం పోయింది..నూనె వాడకం తగ్గించమన్నారుకదా..అందుకే వూరుకున్నా"
"అమ్మో మనమీదకే తిరిగింది మిసైల్" అనుకుంటూ-
" సర్లే..యేదో వొకసారి చేసుకుంటే పరవాలేదని  జ్ఞానులు చెప్పేరు."

"ఇంతకీ యేం చెయ్యమనో.."

".చిక్కటి కాఫీ చెంబుడు
బుక్కగ బుట్టెడు చెగోడి పోగిడ..యాహా
మక్కువ మీరగ తినమే
పక్కన రంభే దిగినను పరుగిడ రాదే"

అన్నారోయ్ యెవరో! చౌడప్ప వారసులు.."
"ఓ కిలో పిండి వుడికించి పారేద్దూ..వారం రోజులు పంటికిందకి చూసుకోనక్కర్లేదు."

"కిలో పిండా?"
"అంతముద్ద యెవరు నలుపుతారు.."

"మరెవరు..ది గ్రేట్ "అని కాలరెగరెయ్యబోయి..బనీనుతో వున్నానని గుర్తొచ్చి ఆగాను.

"సరే..నాదేం పోయింది.. పిండి వుడికిస్తాను.దాన్ని సరి చేసి ముద్దలు రెడీ చేసి నలపడం వరకూ మీదే డ్యూటీ.
నాపని వేయించడం మాత్రమే.
మరో విషయం.. రేపే వెళ్లి రెండు కిలోల ఆయిల్ తెస్తే గాని వంట మొదలవదు.."

"ఓకే మేడం..షరతులన్నీ బేషరతుగా వొప్పుకుంటున్నాను..
అన్నట్టు పెసరపప్పు కాస్త యెక్కువ వెయ్యి.. అలాగే యింగువ..."

ఇక్కడ నా గొప్ప కొంత చెప్పుకోవాలి.
మా బంధువర్గాల్లో నాకు చేగోడీ స్పెషలిస్ట్ గా పేరుంది.

త్వరగా, వొకేసైజులో అందంగా నలపడంలో నన్ను మించిన మొనగాడు మా బంధు వర్గం లో లేడు.
నేను యింట్లో వున్నానో లేదో చూసి మరీ మా అమ్మ కూడ చేగోడీ పిండి వుడికించేది.

మరో విషయం నాకు పప్పు చేగోడీలే యిష్టం. కొయ్య చేగోడీలు నచ్చవు.

'లలలా' అని పాడుకుంటూ చేగోడీలు నలిపే పనికి నడుం బిగించి, చేతులకి నూనె పట్టించి ,వుడికించిన పిండి సరి చేసాను.
అదంతా వొక పెద్ద గుమ్మడి కాయ సైజుకి పెరిగింది.
దానిని చూసి భయం పుట్టి ఐదారు చిన్న వుండలుగా విభజించేను.
ఇహ నలపడం మొదలు పెట్టే సరికి కాలింగ్ బెల్ మోగింది.
'ఎవుడహె. ఈటైములో..'
విసురుగా లేచి వెళ్లి తలుపు తీసాను.

ఎదురుగా మా ఆఫీసు ప్యూన్.

"సార్ ఫోన్ చేస్తే మీరు జవాబివ్వలేదట.
అర్జంటుగా విజయవాడెళ్లమన్నారు.ముకుందం గారి నాన్నగారికి బావులేదన్నారు.ఆరింటికెళ్లి ఫైలు తీసుకుని బస్సులో ఎళ్లమన్నారు"

బాంబు పేల్చేసి ప్యూన్ వెళ్లి పోయాడు.
కాదన్లేని పరిస్థితి.. అసలే ప్రమోషన్ లిస్ట్ లో వున్నాను.

గుమ్మడి కాయనేం చెయ్యడం?

మా యావిడకేం చెప్పడం?
చేగోడీ హెంథపన్జేసెవే?

వెనక్కి తిరిగే సరికి అర్ధాంగి అనుమానంగా చూస్తోంది..గుర్రుగా..

"డియర్! గుమ్మడి కాయ..ఛఛ..చేగోడీపిండి.. ఫ్రిజ్లో...."

గమనిక: కాపీయసురులకు నరకలోక కొయ్యచేగోడి విభాగంలో శాశ్వత వేపుడు ప్రాప్తి రస్తు.

Comments