నా సింగిల్ పేజ్ కథ
కనుగొంటినీ..
*************
ఎటు చూసినా అంబర చుంబిత శీతల శైలశిఖరాలే..
సన్నని కాలిదారి...
నేను ఒక్కడినే ..ఎలా వచ్చానిక్కడికి..
ఏమయింది నాకు..విపరీతమైన చలిగా ఉంది.
వణుకుతున్నాను ఒంటినిండా బట్టలున్నా.
నా ముందు-.
ఎవరో ఏడడుగుల అజాను బాహుడు ..
ఒంటి మీద గోచీ తప్ప మరేం లేదు.
ధృడకాయుడు.జటలు కట్టిన జుట్టు..ఎవరో సాధువులా ఉన్నాడు.
హాయిగా పెద్దపెద్ద అడుగులు వేస్తూ సునాయసంగా నడుస్తున్న అతడు ఒక్కసారి ఆగి,వెనక్కి తిరిగి చూసాడు.
స్ఫురద్రూపి.తీక్షణంగా ఉన్న కళ్లు.ఒళ్లంతా బూడిద.
సాధువే!
నేనతన్ని చేరే దాక ఆగాడు.
నోరు తెరిచి ఏదో అన్నాడు.కానీ నాకు
"అలసటగా ఉందా!" అని అడిగినట్లు అనిపించింది.
తలూపాను.
"ఆకలేస్తోందా"
మళ్లీ తలూపాను.
వణుకుతున్న నాచేయి తన చేతితో గట్టిగా పట్టుకుని నా కళ్లలోకి చూసాడు.
ఆశ్ఛర్యం.
నా ఒళ్లంతా కరెంటు తగిలినట్టు వేడెక్కింది.
చలి బాగా తగ్గింది.
భుజాన ఉన్న జోలెలోంచి మట్టి పాత్ర తీసి నా చేతుల్లో పెట్టాడు.
అక్కడే ఉన్న రాయి మీద కూర్చోమన్నాడు.
"తినడానికే ఏం కావాలి"
"ఛాయిస్ కూడానా...ఈ మంచు ఎడారి లో పూరీ,బంగాళాదుంప కూర,రసగుల్లాలు దొరుకుతాయా" అనుకున్నాను.
సాధువు వంగి పక్కనున్న మూడు మంచు ముక్కలు తీసుకుని నా చేతిలో ఉన్న పాత్రలో పెట్టాడు.
ఆశ్చర్యం.. వేడివేడి పూరీ,బంగాళాదుంప కూర,రసగుల్లాలు గా మారిపోయాయి.
చాలారుచి గా ఉంది. చివరగా అమృతగుళికల్లాంటి రసగుల్లాలు తిన్నాను.
కడుపు నిండిపోయింది.
ఇతడెవరు?నేనెందుకిలా హిప్నటైజ్ చేయబడ్డవాడిలా ఇతనివెనక తిరుగుతున్నాను?
తినడం పూర్తయ్యాక సాధువు తన వెనకే రమ్మని సైగ చేసాడు.
గొర్రెలా అనుసరించడం తప్ప వేరే గత్యంతరమేముంది!
అలా ఎంతదూరం నడిచామో..ఎన్ని కొండలెక్కామో!
అద్భుతంగా ఉంది
ఒకచోట ఆగి సాధువు నన్ను తల పైకెత్తి చూడమన్నాడు.
అక్కడ ఎదురుగా ఆకాశాన్ని తాకు తూ పెద్ద మంచుతో కప్పబడ్డ కొండ శిఖరం అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ కనపడింది.
నా కళ్లు ఆ కాంతి ని చూడలేకపోతున్నాయి.
"ఇదే కైలాసం"
అన్నాడు సాధువు.
నిజమా..వెండికొండ ఇదేనా?
ఏదో శబ్ధం..
చప్పుడుకి తెలివి వచ్చింది.
చుట్టూ చూసాను
బండి ఏదో స్టేషన్లో ఆగింది.
ఆ గొడవకే నాకు తెలివి వచ్చింది.ఇంకా హిమాలయాలు..నాప్రయాణం..సాధువు..కళ్లకి కట్టినట్టుగా కనపడుతోంది.
పూరీ,కూర,రసగుల్లా టేస్ట్ కూడ తెలుస్తోంది త్రేన్పు రావడంతో.
తలగడ పక్కన రాత్రి చదువుతున్న పుస్తకం-
"ఒక యోగి ఆత్మ కథ" కనపడింది.
**** ***** ****"
Comments
Post a Comment