అపోహ

#ఆదివారం- చిన్నకథ

అపోహ
******
రైలెక్కిన దగ్గర్నుంచి గమనిస్తున్నాను ఆ అమ్మాయిని.
ఒక్కర్తే కిటికీ పక్కన కూర్చుని ఉంది.
ఆకర్షణీయమైన రూపం...నొక్కుల జుట్టు ..వాల్జడ...శంఖం లాంటి మెడలో ఒంటిపేట బంగారు గొలుసు తప్ప మరేం లేదు.
పెళ్లి అయిందో లేదో తెలిపే చిహ్నాలు కనపడలేదు గాని ఇవాల్టి రోజుల్లో వాటిని ధరించే వివాహితస్త్రీలు అరుదే.
ఒక్క మాటలో చెప్పాలంటే బాపు బొమ్మ లా ఉంది.
అయితే నన్నాకర్షించింది ఆమె రూపం కాదు.
ఆమె నల్లకళ్లద్దాల వెనక కనపడని ఆమె వ్యథ.
మాటి మాటికీ కళ్ల జోడు తీసి కళ్లు రుమాలు తో తుడుచుకొంటోంది.
ఆమె కళ్లు ఎర్రగా ఉన్నాయి..
బహుశా పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లే కొత్తకోడలు కావచ్చు. అయితే భర్త కనపడలేదెందుకు?
లేదా అత్తంటి నుంచి పుట్టింటికి సీరియస్ గా ఉన్న తల్లినో,తండ్రి నో చూడటానికి వస్తున్న ఆడకూతురు కావచ్చు.
భర్త కు వీలు కాక అమె ఒక్కర్తే బయలుదేరి ఉండవచ్చు.

లేదా భార్యాభర్తల మధ్య కీచులాటలు కారణమా?
త్రాగుబోతు భర్త తో విడిపోయి వస్తోందా?
త్వరగా తెచ్చుకున్నదేదో తిని పై బెర్తు ఎక్కి పడుక్కున్నాను కానీ ఆలోచనలన్నీ బాపుబొమ్మవైపే పరిభ్రమిస్తున్నాయి.
పై బెర్తునుండీ ఆమె వైపు చూస్తున్నాను.
కిటికీ నుండి బయటకు చూస్తోందామె.
మధ్యలో మళ్లీ కళ్లజోడు తీసి కళ్లు తుడుచుకుని,బేగు నుండి ఒక సీసా తీసింది.
నాకు భయం పట్టుకుంది. కొంపదీసి సీసాలో విషం తాగేయదు కదా!
ఎదుటి బెర్తు మీద కూర్చున్న నలభై ఏళ్ల ఆవిడ చేతికి సీసా అందించి-"ఆంటీ! కొద్దిగా ఐ డ్రాప్స్ నా కళ్లలో వేస్తారా?" అంది బాపూబొమ్మ.
****
ఇది నా స్వంతమే.అముద్రితం.
ఏ మాధ్యమాల పరిశీలనలో లేదు.

Comments