శ్మశ్రువోపాఖ్యానం

శ్మశ్రువోపాఖ్యానం
**************
నాకు గడ్డం సరదా.
పదోక్లాసు వచ్చిందగ్గరనుంచీ వస్తున్న నూనూగు రోమాలు నాలో కొత్తకోరికలు రేకెత్తించేవి.
సోక్రటీస్, లింకన్,రవీంద్రనాథ్ టాగోర్, ఆరుద్ర గడ్డాలు నచ్చేవి.

అయితే అలా ఎలా పెంచాలో తెలియక కొంత,పెద్దవాళ్లు నా బూచి అవతారాన్ని విసుక్కోవడం వల్లనూ కొంత నిరుత్సాహం కలిగినా భవిష్యత్తు లో నాకు కావలసిన రీతిలో గడ్డం మీసం పెంచాలనే నిర్ణయించుకున్నాను గఠిగా.

దానికి తోడు బెంగాల్లో గడ్డాలు పెంచుకునే యువత ఎక్కువ.

సరే ఉద్యోగ పర్వం లో కాస్త స్వతంత్రంగా మనకిష్టమైనట్టు పెంచుకోవచ్చని ఆశపడ్డాను.

అలాగే పెంచుకున్నాను కూడా ఇంట్లో వాళ్ల మూతివిరుపుల్ని పట్టించుకోకుండా.
దిక్కుమాలిన గడ్డం కావలసిన రీతిలో పెరిగి ఛావక పోవడం తో దానికోసం రకరకాల తైలాల ఎరువుల్ని కూడా ఖర్చుకి వెనకాడకుండా సమర్పించుకున్నాను.

అయినా..గొర్రెతోక బెత్తెడే అన్నట్టు మేక గెడ్డం లా పెరిగేది.
వీథిలోవాళ్లు,ఇంట్లో వాళ్లు చాటుగా నవ్వుకోవడంతో ఉక్రోషంగా గీకి పారేసాను.
కొద్ది కాలమయ్యాక గోదారి వరద లా గడ్డం కోరిక ఉధృతమైంది.
మళ్లీ మొదలు పెట్టాను.
కాస్త పెరిగింది.
ఓ రోజు ఏదో దుకాణం వెతుక్కుంటూ తలెత్తి చూస్తుంటే ఒక ముస్లిమ్ వ్యక్తి నన్ను ఎగాదిగా చూసి-
"మసీదు అటువేపుంది భాయిజాన్." అన్నాడు.
చిర్రెత్తుకొచ్చి గడ్డం పూర్తిగా తీసేసాను.
రెండేళ్ల దాకా ఆగి మళ్లీ పెంచుదామనుకునే లోగా పెళ్లి సంబంధం రావడం,అట్టహాసంగా పెళ్లి జరగడం అయింది.
భార్యను ఏకాంతంగా గడ్డం పెంచడం గురించి అడిగాను వీలుచూసుకుని.
 "అబ్బ..పాడు గెడ్డం..నాకు చిరాకు.మా నాన్నలా క్లీన్షేవ్డ్ మగాళ్లంటే నాకిష్టం."
అనగానే హతాశుడినయ్యాను.
పెళ్లి చూపుల్లోనే గడ్డం క్లాజ్ పెట్టనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.
'ఈ జన్మ కింతేనా!గడ్డం లేని బతుకూ ఒక బతుకేనా!'
అని దేవదాసు లెవెల్లో పాడాలనిపించింది.
రోజులు,నెలలు,సంవత్సరాలుగా మారి కాలప్రవాహంలో కొట్టుకుపోయి రిటైరయ్యాను.

సరే ఇప్పుడైనా సరదా తీర్చుకుందామని గడ్డం పెంచనారంభించేను.
ఇంట్లో వాళ్లకి నా గడ్డం కష్టాలు తెలుసు కాబట్టి సానుభూతితో ఇష్టం లేకపోయినా ఊరుకున్నారు.
అయితే అమర్ నాధ్ యాత్ర రూపంలో నా గడ్డానికి అడ్డం వచ్చింది.

అ వ్విధంబెట్టిదనిన-

యాత్రికులు ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్లాను.
అతగాడు నన్ను చూసి
"సార్! ఈ గడ్డంతో మీరు మీ వయసుకన్నా పెద్దవారిలా కనిపిస్తున్నారు.
బెటర్..మీరు తీసేయండి."
అన సరై గడ్డాన్ని తీసేసాను.
పైకి చెప్పకపోయినాఇంటిల్లిపాదీ "హమ్మయ్య!పీడ ఒదిలింది." అనుకునే ఉంటారు.
ఉక్రోషం రానురాను పెరిగిపోతోంది.
కోరిక తీరేదెలా?
అందుకే ఒక మార్గాన్ని ఆలోచించాను.
దాన్ని అమలు పరచడానికే ఇప్పుడు బజారులో నడుస్తున్నాను.
అమ్మయ్య!
కనపడింది.
నాటక దుస్తుల విక్రయశాల
లోపల నాకు పెరగని అన్ని రకాల గడ్డాలని అంటించుకుని,వాటితో ఫోటోలు తీయించుకుని నా సరదా తీర్చుకుంటాను.
ఏమంటారు..మిత్రులారా!

Comments