కలం కలకలం 2/కక్కగట్టాయణం
**************************
మిత్రులు,భిషగ్వరులు,వాల్మీకి భక్తులు శ్రీ బొగ్గవరపు వారి కోరిక మేరకు 'కలం సీక్వెల్' మీముందు...
ఆరోక్లాసులో గంటివాడు నా పక్కన ఎప్పుడూ ఉండీవాడు.
వాడెప్పుడూ సిరా ముష్టికి తయారు గా ఉండేవాడు.
ఒకసారి వాడు జపాను పెన్ను తెచ్చాడు. జపానంటే ఇంపోర్టెడ్ కాదు...దాని బాడీ నలుపు కేపు ఎరుపు..లోపల స్క్రూ నీలం..ఇలా ఉంది.
దంత ప్రయోగాల వల్ల సొట్టపడ్డ స్క్రూని పెన్నుల కార్ఖానాలోని ఒక సరిపోయే దానితో బిగించాడు వాళ్ల అన్న.కేప్ పారేస్తే అదే కార్ఖానాలోని మరో అవయవం రిప్లేసయింది.
ఇంతకీ ఆ పెన్ను లో ఇంక్ పోసి టెస్ట్ చెయ్యాలి.
సిరా ఒంపే సమయంలో స్క్రూ లూజై చేతులూ,బట్టలు,బల్లా కంగాళీగా తయారైంది.
అవన్నీ సరిచేసుకుని భయపడుతూ ఇంటికి వెళ్లేసరికి మా అమ్మ ఎవర్తోనో మాట్లాడుతూ కనిపించింది.
"బతికేన్రా" అనుకుని పిల్లిలా దూరి గబగబ ఇంట్లోకి వెళ్లపోయి తొందరగా లాగు,చొక్కా ప్లాస్టిక్ బకెట్లో పడేసి చెంబుడు నీళ్లు కుమ్మరించి నంగనాచిలా గది లో కొచ్చి పుస్తకాలు సర్దడం మొదలుపెట్టాను.
అమ్మ బాతాఖానీ పూర్తయి లోపలికొచ్చి నా వేపు చూసింది.
ఇక్కడ మా అమ్మ గురించి చెప్పాలి.
ఆవిడకి కక్కగట్టు అనే తిట్టు ఊతపదం.
అందర్నీ వీలుంటే దేవుణ్ణి కూడాఅలాగే తిట్టగలదు.
"ఓరే కక్కగట్టా! పళ్లపారిగా...ఇలా రా!"
"ఆ దిబ్బ కూరల కక్కగట్టు వచ్చాడా!" ఇలా ఉంటుంది ఆవిడ ధోరణి.
మాకైతే అష్టోత్తర శతనామాలే రోజూ.
అయితే ఆమె 'పల్కు దారుణాఖండశస్త్రతుల్యము మనసు నవనీత సమానము' అనవచ్చు.
తనపర బేధం లేని మనిషి.
పెట్టేడప్పుడు పెద్దచెయ్యి.
ఆవిడది భారీ శరీరం.
నేను ఎప్పుడూ ఆవిడని సన్నగా చూడలేదు.
కానీ ఆవిడ మాత్రం -
"మొదట్లో నేను' సలాకు' లా సన్నగా ఉండే దాన్ని" అనేది.
ఆ సలాకు..సన్నం నాకైతే ఎప్పుడూ కనపడలేదు.
అయితే పాత ఫొటో ఒక దాంట్లో ఆమె అత్తగారూ,ఆడపడుచు,మరిది సహితంగా ఉన్న ఒకేఒక రుజువు కనపడింది.
ఆవిడ ఛాయ తక్కువ...నలుపుకిందే లెక్క.కుగ్రామంలో మేనమామ చాటున పెరగడం తో చదువు కూడా అయిదో క్లాసు దాటలేదు.
నేను పెద్దయ్యే కొద్ది అమె ఊబకాయం వల్ల పడే అవస్థలు కనపడేవి.
కదలడం దుస్సహమైంది.బయటకు వెళ్తే రిక్షా తప్పనిసరి. నాలుగడుగులు వేయడానికి ఆపసోపాలు పడేది.
ముప్పయ్యేళ్లుగా బెంగాల్లో ఉన్నా ఆభాషలేదా హిందీ నేర్చుకోలేదు.నిరక్షరాస్యత ఒక కారణమైతే తన పరిచయస్తులందరూ తెలుగు వారే కావడం మరో కారణం.
వీధరుగు మీద కూర్చుని వచ్చేపోయే వారిని పిలిచేది అవసరాన్ని బట్టి.
దానికి తోడు పేర్లు మరిచిపోతూ ఉండే ది.
"ఒరే.క.క్కగట్టా!నల్లవెధవా..నీ పేరేంటీ..ఒకసారి రమ్మీ..." ఇలా పిలిచేది.వాళ్లకి బాష అర్ధం కాకపోయినా పిలుస్తోందని తెలిసిపోయి -"క్యా అమ్మా" అని వచ్చేవారు. బెంగాల్ కదా..చుట్టుపక్కలంతా హింది,బెంగాలి కుటుంబాలుండేవి.
రిక్షావాళ్లుతోనీ అలాగే మాట్లాడేది.
చాలామంది తెలుగువారే!
వాళ్లతో వచ్చీరాని హిందీ లో మాట్లాడబోయేలోగా వాళ్లే ఆమె అవస్థ గ్రహించి-
"నాకు తెల్సు మీయిల్లు..ఆ ఇస్కూలు కాడే కదా..పల్లక కూకో!"
అనీవారు.
ఆవిడ రిక్షా ఎక్కడం కూడా పెద్ద ప్రహసనమే
"కక్కగట్టా!
"వెధవా! రిక్షా కదలకుండా పట్టుకో..పడి ఛస్తాను..నారాయణ నారాయణ" అంటూ పక్కనున్న వాళ్లు సాయంచేస్తే ఎక్కేది.ఆమె కూర్చున్నాక పక్కన మరొక పిల్లడికి మాత్రమే సరిపోయే జాగాలో మా నాన్నగారు గొణుక్కుంటూ ఇబ్బందిగా కూర్చునేవారు.
అంతవరకు బ్రేకులు పట్టి ఉంచిన రిక్షా వాడు రథమెక్కి నవ్వుకుంటూ పోనిచ్చేవాడు.
జపం విడిచి లొట్టల్లో పడ్డాను.
ఆరోజు నిర్వాకానికి మంగళా ష్టకాలు పూర్తయ్యాక గంటి వాడ్ని తిట్టుకున్నాను.
అన్నట్టు వేస్లిన్ డబ్బీ కూడా బేగులో ఉండేదండోయ్..స్క్రూ చుట్టూ వేస్లిన్ పూస్తే కక్కదట.
Comments
Post a Comment