దేవుడు నవ్వాడు
**************
ఈ మధ్య అనుకోకుండా ఒక పెళ్లికి వెళ్లవలసి వచ్చింది.
మేము కూడా సాయంగా ఉంటే వస్తామని కామన్ చెన్నయి అరవ స్నేహితులు అంటే సరేనని బయల్దేరి వెళ్లాం.
మా ఇద్దరికీ సెకెండ్ ఏసీలో అప్పర్ బెర్తులే దొరికాయి. నాకు పర్లేదు కానీ మా అమ్మికి ఇబ్బంది.
సరే రిక్వెస్ట్ చేస్తే ఒక్క లోయర్ బెర్తు దొరక్క పోదా అని బయల్దేరాం.
కానీ బండిలో ఖర్మకాలి అందరూ సీనియర్సిటిజెన్లే!
ఒకరిద్దరు చిన్నవయసు అమ్మాయిలు కనపడ్డా బాక్ పెయిన్ లాంటి కారణాల్తో నిరాకరించారు.
మాతో పాటు కూపేలో ఉన్న సీనియర్ జంట కూడా కీళ్ల బాధితులే.
సరే రాత్రి భోజనం ముగిసాక ఓసారి కంపార్ట్మెంటంతా కలయజూస్తే ఒక బే లో నాలుగు బెర్తులు ఖాళీగా "సుందరాంగా అందుకోరా!" అనిపిలుస్తూ కనిపించాయి.
వాకబు చేస్తే విజయవాడ కోటా అని తెలిసి మేమిద్దరం షిఫ్టయ్యాం..అప్పుడు చూసుకోవచ్చని.
లోయర్ బెర్తులో పడుక్కున్నామే కాని గుబులుగా ఉంది.ఎవరెప్పుడు తట్టి లేపేస్తారోనని.
కాస్సేపటికి బండి కుదుపుకి నిద్ర పట్టేసింది.
పదకొండున్నర అయేసరికి విజయవాడ వచ్చింది.జనాలు 'పొలో'మంటూ ఎక్కేసారు.
తెలివొచ్చి చూసేసరికి బెర్తులు వల్లించుకుంటు,సెల్ఫొన్ లైట్లతో వెతుక్కుంటూ వచ్చేసారు బెర్తు హక్కుదారులు.ఇద్దరు మగ ఇద్దరు అడ.
లాభంలెదని తెలుస్తున్నా రిక్వెస్ట్ చేసాను.అనుకున్నట్లే 'సారీ 'అన్నారు.
చేసేదిలేక కాందిశీకుల్లా మా పక్కబట్టలు,సామాన్లు మోసుకుంటూ మా కూపే దగ్గరకి చేరుకున్నాం.
కింద నున్న కీళ్లజంట హాయిగా పడుకునున్నారు.
వాళ్ల కాళ్ల దగ్గర కూర్చున్నాం.
అంతలో టిటిఇ వచ్చి ఆశ్చర్యం గా చూసాడు.
పరిస్థితి చెప్పాను.
సానుభూతి గా విని "ఖాళీలేదండి" అన్నాడు.
ఈ గొడవకి కీళ్లాయన లేచి కూర్చుని సంగతి విని జరిగాడు
"పరవాలేదు కూర్చోండి.ఎలాగూ అన్న వరం లో దిగుతారు కదా అప్పుడు పడుకుంటాను."అన్నాడు
అతని థాంక్స్ చెప్పి
"మీకెందుకుశ్రమ.పడుకోండి.నేను పై బెర్తు మీదకి వెడతాను." అన్నాను.
అరగంట గడిచాక టిటిఇ మళ్లీ వచ్చి కిందనున్న
మా అమ్మితో-
"మేడం.51 లోయర్ ఖాళీ.మీరక్కడ పడుకోండి.మీ బెర్తు మరొకరికి ఇచ్చాను." అన్నాడు.
"హమ్మయ్య" అనుకుని ఇద్దరం సెటిల్ అయ్యాం.
మూడున్నరకే అన్నవరం వచ్చింది.
ఇద్దరం దిగిపోయాం.
మా అరవల బండి Rimjhim మెయిల్ ఐదున్నరకి వచ్చింది గంటన్నర లేటుతో.
అంతవరకూ పోతుల్లాంటి దోమలకు చిక్కకుండా ఇద్దరం ప్లాటఫారం మీద వాకింగ్ చేసాం.
సరే వాళ్లను కలిసాక అందరం కలసి స్టేషను బయట దేవస్థానం వారి బస్ ఎక్కి ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసిన హరిహర సదన్ చేరుకున్నాం.
దారిలో మధ్యలో ఉన్న పిఆర్వో ఆఫీసులో దూరి కాషన్ మనీ ఫార్మాలిటీ ముగించుకున్నాం.
రూమ్ లో ఫ్రెష్ అయ్యాక తిన్నగా దర్శనానికి బయల్దేరి వెళ్లాం.తొమ్మిది న్నరలోగా దర్శనం పూర్తయింది.
బయటకు వచ్చి రామాలయం ఇతర గుళ్లూ గోపురాలు చూస్తూ ఉంటే ఒకపూజారి కనపడి అగి,తనంతతానే మా వివరాలు అడిగి తెలుసుకుని పదిన్నరకి దేవస్థానం అన్నదాన సత్రం లో స్వామి వారి ఉచిత ప్రసాదం స్వీకరించి తిరుగు బస్సు పట్టుకోమని చెప్పారు.
ముందుగా మేక్ మై ట్రిప్ లో బుక్ చేసుకున్న న్యుగో బస్సు
కింద నేరేళ్లమ్మ తల్లి గుడి దగ్గర 1 .40 కల్లా ఉండమని ఆదేశించారు
ఇక్కడ అన్న ప్రసాదం పదకొండు వరకూ మొదలవదట.అప్పుడు వెళ్లి రూం ఖాళీ చేసి,మళ్లీ పీఆర్వో ఆఫీసులో రిఫండ్ తీసుకుని పికప్ పాయింట్ చేరుకోగలమో లెదోనని భయపడ్డాం.
అయితే పూజారి గారు ధైర్యం చెబుతూ పదకొండున్నరకల్ల భోజనాలు పూర్తవుతాయనీ, ఆతర్వత అరగంటలో వెకేషను,రిఫండ్ తీసుకుని అనుకున్న దానికన్నా ముందే పికప్ పాయింట్ చేరుకోవచ్చనీ చెప్పారు.
అక్కడి దారులూ,దూరాలు మనకి కొత్త కాబట్టి చేరగలమో లేదోనని నేను చిరచిరలాడేను.
అయినా మెజారిటీ అంగీకరించడము కారణంగా నేను కూడా తగ్గక తప్పలేదు.
"ఇంత దూరం వచ్చి స్వామి వారి ప్రసాదం తినకుండా వెళిపోతారా?" అని ఆయన సున్నితంగా హెచ్చరించారు.
అతను అన్నవరం రాకముందు హైదరాబాద్ లో ఏదోకంఎనిలోమానేజరు గా పనిచేస్తూ వదిలేసి ఇక్కడ. దేవస్థానం లో చేరేట్ట.యువకుడే.
వ్రతకథలో శెట్టి భార్య ,కూతురు గుర్తుకొచ్చి నేను కూడా తగ్గాను.
అయినా లోలోపల భయంగానే ఉంది.
ఎలాగో పదకొండు కల్లా భోజనాలు మొదలయ్యాయి. త్వరగా వడ్డన పూర్తి చేసి హారతి ఇచ్చాక భోజనం మొదలయింది. పదకొండున్నరకల్లా బయటకొచ్చాం.
దేవస్థానం ఉచిత బస్సు రెడీగా ఉండడంతో హోటల్ కి వచ్చి మా బట్టలవీ సర్దుకుని రిసెప్షన్ లో తాళాలు ఇచ్చాం.అతగాడు క్లి యరెన్సు ఇచ్చాక మా సామాన్లతో బయటకు వచ్చేసరికి మళ్లీ బస్ రెడీగా ఉంది.పీఆర్వో ఆఫీసులో రిఫండ్ తీసుకుని ఆటో మాట్లాడుకుని పికప్ పాయింట్ చేరేసరికి పన్నెండు న్నర.
అంటే గంట ముందే వచ్చేసాం.
అక్కడ కోవెల లో కూర్చుని బస్సు కోసం ఎదురు చూస్తుండగా మళ్లీ ఆ పూజారి గారే మోటరుసైకిల్ మీద దారంట వెడుతూ మమ్మల్ని చూసి గుర్తుపట్టి ఆగారు.
" అన్న ప్రసాదం తీసుకున్నారా?అనుకున్న విధంగా అయ్యాయా మీ పనులు? " అన్నారు కొంటెగా నన్ను చూసి నవ్వుతూ.
సాక్షాత్తు సత్యనారాయణ స్వామి వారే అడిగి నట్టనిపించింది.
Comments
Post a Comment