కలం కలకలం
***********
కలం..అదే పెన్ను బహుశా ఐదోక్లాసు లో లేదా ఆరో క్లాస్‌లో అనుమతించారనుకుంటాను.అంతవరకూ పెన్సిలూ..ల(ర)బ్బరే!
అప్పట్లో ఈ బాల్పెన్నులు ఎరగం.
లావుపాటి ఎర్రపెన్నులు రూళ్లకర్రల్లా ఉండేవి.
అరసీసాడు దయాల్ ఇంకుపోస్తే గానీ దాని కడుపు నిండేది కాదు.
అందులో అప్పు..
ఇంక్ అప్పడిగిన వాడికి ఏకాగ్రతతో నోరు ఒక పక్కకివంక పెట్టి,నాలిక మడత బెట్టి దానకార్యక్రమం ముగించడం...
పాళీలు,టంగులు మార్చడం..కేప్ పెట్టడం మర్చిపోయి అలాగే జేబు ల్లోకి తోసెయ్యడం..తద్వారా ఏర్పడ్డ ఇండియా మేప్
పెద్దాళ్ల కళ్లపడకుండా దాచేయటం..
మరో ఉపద్రవం..హోలీ..ఇక్కడకన్నా ఉత్తర భారతంలో హోలీ విశృంఖలంగా చేస్తారు.
ఆరోజు ఎవర్నీ ఏమీ అనలేని స్థితి. ఆడా మగ తేడా లేకుండా ఇంటికొచ్చి మరీ రంగులు పట్టిస్తారు.
అవి వదల్డానికి వారం పదిరోజులు పడుతుంది.అంతవరకూ కిష్కింధావాసుల్లా తిరగడమే!
ఇహ స్కూల్ పిల్లల్లో అల్లరి మరోలా ఉంటుంది.
దుంప లేదా ఆలుగడ్డ లో కెడి ,420 వంటివి బ్లేడు లేదా చాకుతో చెక్కి,దానిని సిరా లేదా స్టాంపు ఇంకులో ముంచి వీపు వెనకాల షర్టు మీద ముద్ర వెయ్యడం.
వీధిలో నగుబాటు..ఇంట్లో చీవాట్లు.
ఓహ్..ఎన్ని పర్రాకులో...
నాకు నీలం కన్నా నలుపు సిరా ఇష్టం.అచ్చులా అనిపించేది.
టీచర్ల దగ్గర ఆకుపచ్చ,ఎర్ర పెన్నులు కూడా అబ్బురమే.
రత్నం పాళి,ప్రసాద్ పాళీల కోసం వెంపర్లాట..
బాల్ పెన్నులు జెల్ పెన్నులు వచ్చాక మరకల బాధ తప్పింది.ఒకే పెన్నులో రకరకాల రంగుల రిఫిళ్లు గమ్మత్తుగా ఉండేది.
ఇప్పుడైతే వ్రాయడం పూర్తిగా తగ్గిపోయింది.వేలుతోనే టైప్ చేసేస్తె చాలు.
అచ్చులా ప్రింట్ అయిపోతోంది.వాయిస్ టైపింగ్ సరేసరి.
అయినా నా కిప్పటికి పెన్నుల సరదా పోలేదు.
రకరకాల పెన్నులు కనపడితే కొంటాను
Comments
Post a Comment