భయం

భయం
******
ఎక్కడో
కొండల శిఖరాల్లో
 పుట్టి-
లోయల్లో ప్రవహిస్తూ,
అడవులను తడుపుతూ,
ఉల్లాసంగా,ఉద్వేగంగా
పరుగులిడుతూ వచ్చిన
తరంగిణి ,
ఎదురుగా కనిపిస్తున్న
అనంత జలరాశిని చూసి ఉద్విగ్నతకు లోనైంది.
తడబడుతూ అగింది.
ఏదో తెలియని భయం..
చెప్పలేని సంకోచం...
తనిప్పుడు ఈ అనంత జలరాశిలో ఏకమవుతే
ఏదీ తన అస్తిత్వం?
తనని గుర్తించేవారెవరు?
అయినా తన ప్రయాణం ఆగదు.
ముందుకు కదలక తప్పదు..
వెనుతిరిగే ప్రశ్నే లేదు!
కాబట్టి-
తను ముందుకు సాగడమే కర్తవ్యం.
తన కలయికతో అంబుధిని బలోపేతం చేయడమే తన లక్ష్యం.
విశాల జలరాశిలో తన అస్తిత్వాన్ని లయం చేయటమే తన జన్మ సార్ధకం.
'నదీనాం సాగరో గతి' అన్నారిందుకే.

(ఖలీల్ జిబ్రాన్ కవితకు స్వేచ్ఛా రూపం.)

Comments