ఆ నలుగురూ...

ఆ నలుగురూ...
***********
చిన్నప్పటి నుండీ వింటున్నాను. ఎవరయ్యా ఆనలుగురూ!!
కలికం వేసి చూసినా కనపడరు.ఎంతసేపు అందరి నోళ్లలో నానుతారు.
"బుద్ధీ,మప్పితం నేర్చుకో! నలుగురూ చూస్తారు"
"కాస్త నదరుగా కనపడకపోతే నలుగురిలో నామర్దా!"
"నలుగురూ నవ్విపోగల్రు"
"నలుగురి లో పేరు తెచ్చుకోవాలి"
ఆపని మాత్రం "చెయ్యకండి.నలుగురిలో నవ్వులపాలవుతాం"
"అదేవిటమ్మాయ్..ఆ డ్రెస్సూ.. అలా ఒళ్లంతా కనపడుతూ..నలుగురూ ఏమనుకుంటారనే జ్ఞానం కూడా లేదా?"
"రేపొద్దున్న పెళ్లికయినా,చావుకైనా రావాల్సింది ఆ నలుగురే!"
ఇలా ఊదరగొడ్తారు.
ఇంతకీ ఎవరా నలుగురూ?
వాళ్లకేమీ పనులుండవా?
ఎంతసేపూ పక్కవాళ్లెవరెవరేమి చేస్తున్నారో,ఎలాఉన్నారో చూడటమేనా  వీరి పని.
వాళ్ల విషయాలు వాళ్లెందుకు చూసుకోరూ!
మనకేదైనా ఇబ్బంది, కష్టం గాని వస్తే పోనీ ఈ నలుగురిలో ఒక్కడేనా ' నేనున్నానని 'సాయం చేయటానికి ముందుకొస్తాడా?
ఆర్చేవారా! తీర్చేవారా! 
మరెందుకు తగుదునమ్మా అని అందరి వ్యవహారాలలో తలదూర్చి ముందుంటారు?
నాకు అదే అర్ధం కాదు.
మన తిండి,బట్ట మనం కట్టుకుంటే వాళ్లకేమిటట సలుపూ!
మీకెదురయితే నాకు చెప్పండి. నలుగుర్నీ జల కడిగేయకపోతే నా పేరు కాదు.హన్నా!

Comments