నాలో నేను
**************
రాత్రి పదకొండు గంటలు.
టేబిల్ కి దగ్గరగా కుర్చీలాక్కుని కాయితాలు నలుపు చేస్తున్నాను.
" ఏదో గిలుకు తున్నట్లున్నావు"
తుళ్లి పడ్డాను.
మళ్లీ వచ్చాడు వీడు.
వచ్చినప్పుడల్లా ఏదో హితబోధ.నన్నేపనీ చెయ్యనివ్వక సైంధవుడ్లా అడ్డుపడతాడు.
పానకంలో పుడక.
"ఏం లేదు" గొణిగాను.
"ఏ రచయిత అయినా తనెందుకు,ఎవరికోసం రాస్తున్నాడో తెలుసుకుని మరీ రాయమన్నాడు రావిశాస్త్రి. "
కాళ్లూపుతూ అన్నాడు వాడు నాకేసి కాస్త హేళనగా చూస్తూ.
నాకు లోపల మండుతున్నా ఊరుకున్నా.
మాటకి మాట తెగులు.
" అయినా నువ్వేం రాస్తావులే!
ఏ ఇంగ్లీషు కథో,వ్యాసమో అనువాదం చేసి పారేస్తావు.
లేదంటే ఏ బెంగాలీ,కన్నడ,ఒరియా,
కథల భావాన్ని సంగ్రహించి తెలుగుపేర్లతో పంపేస్తావు.
నన్నయ,తిక్కనలా ప్రబంధాలెటూ వ్రాయలేవు.
శ్రీపాద,మల్లాది,సత్యం శంకరమంచి లా తెలుగుతనం ఉట్టిపడేలా కథలు సృష్టించటం చేతకాదు.
శ్రీ శ్రీ లా విప్లవ శంఖం పూరించలేవు.
తిలక్ లా కవిత్వం చెప్పలేవు.
రావిశాస్త్రి లా యాస కథలు సామాజిక స్పృహతో రాయలేవు.
మహిళా రచయిత్రుల్లా సెంటిమెంట్ పండించలేవు.
మల్లాది,యండమూరి ల మాదిరి కమర్షియల్ సక్సెస్ సాధించలేవు.
మరైతే నువ్వు వ్రాసేదేమిటి?
ఎవరికోసం?
ఏ ప్రయోజనాన్ని ఆశించి వ్రాస్తున్నావు?"
"వాళ్లూ విదేశీ రచనల ప్రేరణతో వ్రాసామని ఒప్పుకున్నారు"
అన్నాను నంగిగా.
"అయితే నీదగ్గర సరుకు లేదన్నమాటేగా!
మరేం చేస్తావిప్పుడు.
కొత్త గా సృష్టి చేసే శక్తి లేనప్పుడు జ్ణానాన్ని పెంచుకునే మంచి పుస్తకాలు చదవటమే మార్గం.వ్రాయాలన్న తపన మంచిదే.
కానీ ఎంత బాగా ఇతరులవి చదివితే మన లోటుపాట్లు తెలుస్తాయి.
ఎ గుడ్ రీడర్ ఓన్లీ కెన్ రైట్ సంథింగ్ టు రీడ్.
కాబట్టి సుబ్రావ్! ముందు చదువు.బాగా చదువు.అప్పటికీ వ్రాయాలనిపిస్తేనే వ్రాయి.
ఏమంటావ్!"
నేనప్పటికీ మాటాడలేదు.
వాడు వాగుతునే ఉన్నాడు.
"అసలు మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుందోయ్.
మీరు సమయం తో పాటు మీ మూస కథలని పుంఖానుపుంఖాలుగా జనాల మీదకి తోసేస్తూ ఉంటారు.
ఒకటే ఇతివృత్తం తో లక్షలాది కథలు వచ్చేస్తుంటాయి.
ఈ మధ్య చూడు.
అత్తా,కోడళ్ల దెబ్బలాటలు పోయాయి.
ఎన్నారై దంపతులు...వాళ్లు వదిలేసిన వృద్ధ తల్లిదండ్రులు.. వృద్ధాశ్రమాలు..ఇదో ట్రెండ్.
ఎన్నాళ్లీ కథలు..
లేకపోతే నేరాలు..ఘోరాలు...
పేపర్ లలో టీవీ న్యూసుల్లోనూ అవే.
అన్నట్టు సైబర్ నేరాలు కూడా కథా వస్తువులే.
బోడెద్దుకు పోట్లు మప్పినట్లు తిన్నగా ఉన్నవాడికి కూడా నేరప్రవృత్తి అలవడేలా దృశ్య చిత్రీకరణలు.
భగవాన్! ఎటుపోతోందీ దేశం!"
వాడి వాగ్ధాటి అగేలా లేదు.
అస్త్రసన్యాసం చేసిన అర్జునుడి లా పెన్ను మూసి,కాయితాలు పక్కకి జరిపి లేచాను.
నిద్రపోతే హాయి.
"ఏమైంది ఎక్కడో గుచ్చుకుందా! పారిపోతున్నావ్ మైడియర్ వెంకటేశం!'"
వెకిలి నవ్వు వినపడుతుండగా మంచం మీదకి చేరి నిద్రకుపక్రమించాను.
Comments
Post a Comment